జనసేన ప్రతిష్టను దెబ్బతీయ్యాలని రెండు పార్టీల ప్రయత్నం: పవన్ కళ్యాణ్
పత్రికల్లో వస్తున్న అసత్య కథనాలపై పవన్ ట్విట్టర్ స్పందన.
నేనొక సైనికుడిని పోరాటానికి ఎప్పుడూ సిద్ధం
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ప్రత్యర్ధి పార్టీలు ఇలాంటి ఎన్నో అసత్య కథనాలు ప్రచారంలోకి తెస్తాయనీ, వాటన్నిటికీ ప్రజలు సిద్ధపడాలని జనసేనాని కోరారు. ఇలాంటివే మరికొన్ని పవర్ ఫుల్ పంచ్ లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సంధించారు. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తోందంటూ సాక్షి పత్రికలో శుక్రవారం ఓ నిరాధార, అవాస్తవ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో ఈ ట్వీట్లు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
టీడీపీ, వైసీపీ పార్టీలు కలిసి జనసేన ప్రతిష్ఠని దెబ్బతీసేవిధంగా అనేక వరుస కథనాలు సృష్టిస్తున్నాయని సీనియర్ రాజకీయ విశ్లేషకులొకరు తనకు చెప్పారని కూడా ఒక ట్వీట్ లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ రోజు ట్విట్టర్ ద్వారా మరెన్నో విషయాలను పవన్ పంచుకున్నారు. ‘‘జనసేన పార్టీ బీజేపీ,వైసీపీల మద్దతుదారు అని టీడీపీ విమర్శించింది. ఇప్పుడు జనసేనని టీడీపీ భాగస్వామి అని వైసీపీ అంటోంది. రాజభవన్ లో నేను కేసీఆర్ ను కలిసినప్పుడు టీడీపీ వాళ్లు టీఆర్ఎస్, వైసీపీలతో కలిసిపోతానంటూ ప్రచారం చేశారు. ప్రజలకోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచీ ఇబ్బందులు రావడం సహజం’’ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘పోరాటం చేయడానికి ఒక పత్రిక, టీవీ ఛానల్ ఉంటే బాగుండునని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం గారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన సొంత పత్రిక, ఛానల్ లేకుండానే పోరాటం చేశారు. నా జనసైనికులే నా పత్రికలు, టీవీ చానళ్ళు. ఈ కథనాలన్నీ ఆగిపోవాలంటే నేను ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి. అంతేగానీ సొంతంగా పోటీ చేయకూడదనేది వారి అభిమతం. రాజకీయ చదరంగంలో నేనో చిన్న పావుని కావచ్చు. కానీ పాతుకుపోయిన ఆ రాజకీయ శక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. నేనొక సైనికుణ్ణి. పోరాడేందుకు ఎపుడూ సిద్దం.’’ అంటూ పత్రికలు, చానళ్లు నడిపే రాజకీయ నాయకులకు, వారి మద్ధతుదార్లకు జనసేనాని చురకలంటించారు.