రాజకీయ నాయకుల్లో ఎవరికి మానసిక వ్యాధి ఉంది..? ఎవరికి లేదు? దీని గురించి తెలుసుకోవడానికి చక్కని సూత్రం ఉంది.
మీకు సొంత ఇల్లు లేదు.. సొంతిల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. తప్పు లేదు. పిల్లల చదువుల కోసం మరో ఇల్లు కూడా కొనుక్కుంటే అద్దె వస్తుందని కోరుకుంటారు. తప్పులేదు. కానీ… మీరున్న బజారులో ఉన్న ఇళ్లన్నీ మీవే కావాలి అని అనుకుంటే.. ఖచ్చితంగా మీకు తేడా అంటే.. ‘‘మానసిక వ్యాధి’’ ఉన్నట్లే అని ఒక సమాజ శ్రేయోభిలాషి చెప్పారు.
దీని ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులను అంచనా వేస్తే.. పార్టీల అధ్యక్షులతో సహా, 99 శాతం మందికి ఈ తరహా మానసిక వ్యాధి ఉన్నట్లే లెక్క. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు, ఆయన పార్టీలో ఉన్న అనేక మంది సామ్రాజ్యవాదులూ… అందరూ ఆస్తి, డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టారు. వేల కోట్లున్నా… వారికి శాంతి లేదు. అమరావతిలో అనేక భూముల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా సంపాదించుకునే పనిలోనే ఉన్నారు. అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీలోని ప్రజాప్రతినిధులను చూస్తే వారందిరికీ కూడా ఈ మానసిక వ్యాధి ఉన్నట్లే లెక్క.
ఈ రెండు పార్టీలకు చెందిన అధినేతలూ, అనేక మంది నేతలూ… రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదన కోసమేనన్నది బహిరంగ రహస్యం. 70 ఏళ్లుగా… కోటీశ్వరులే రాజకీయాలను నేటికీ శాసిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్లను కోటీశ్వరులకే ఇవ్వాలని నిస్సిగ్గుగా పార్టీపరంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెసు పార్టీ మొదటి నుంచీ భూస్వాములకు పెద్దపీట వేసింది. కోటీశ్వరులను ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పదవులు కట్టబెట్టి సామాన్య జనాన్ని పీడించుకుని తినేలా చేసింది. కాంగ్రెసు పార్టీ సిద్ధాంతం నేటికీ ఇదే ఉంది. అధికారపరమైన యావ తప్ప ఇది మరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెసు మొదటి నుంచీ ఇదే పని చేసింది. పొగాకు ఎగుమతిదారులూ, కాంట్రాక్టర్లకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేసింది. తద్వారా నేటికీ పేద ప్రజలు వారి వెంట తిరగాల్సి వస్తుంది. వేల కోట్ల కాంట్రాక్టులూ, ప్రాజక్టుల పనుల ముందు సామాన్యుడి పనులు ముఖ్యం అవుతాయా? తెలుగుదేశం, వైఎస్సార్సీపీ లు కూడా కోటీశ్వరులకే పెద్దపీట వేసి… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నాయి.
మరో విషయం ఆలోచించండి…
చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డికి చెందిన వివిధ సంస్థల్లో లక్ష నుంచి 5 లక్షల వరకూ జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు ఎందరో ఉన్నారు. ఉద్యోగులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్న వ్యక్తులు… ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇచ్చే లక్షన్నర జీతం కోసం వారు పని చేస్తారా? ఇది కీలకమైన ప్రశ్న. కాదు అన్నది మీ సమాధానం అయితే… మరి ఈ లక్షన్నర కాకుండా వారికి కావాల్సింది ఏదో ఉంది. ఆ ఏదో ఏమిటి? లక్షల కోట్ల సంపాదన. ప్రాజక్టులు…!!
ఈ లక్షన్నర జీతం ఇస్తే… బ్రహ్మాండంగా ప్రజాసేవ చేయగలిగలిన యువతీ యువకులు ఎందరో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఇలాంటి వారికి పెట్టుబడిదారీ పార్టీలయిన తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు సీట్లు ఇవ్వవు. కోటీశ్వరులకు టిక్కెట్లు ఇస్తాయి. వారిని తెచ్చి పేదవాడి నెత్తిన రుద్దుతాయి. వాళ్లంతా కోట్లు సంపాదించుకుంటూ బెంజి కార్లలో తిరుగుతుంటే… పేద ప్రజలు వాళ్ల కార్ల వెనుక జండాలు మోస్తూ.. ఆ ధూళిలో కలిసిపోతున్నారు.
తెలుగుదేశం, వైఎస్సార్సీపీల్లో ఉన్న రాజకీయ నాయకులు… ఆయా పార్టీల అధ్యక్షులతో సహా ప్రజా ప్రతినిధులుగా పని చేయడానికి అనర్హులని మీకు అర్థం కావడం లేదా? కోట్లకు పడగలెత్తిన నెల్లూరు నారాయణ మాత్రమే ప్రజలకు సేవ చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారా..? కోట్లకు పడగలెత్తిన సుజనా చౌదరి మాత్రమే ప్రజా సేవ చేయగలరని మీరు భావిస్తున్నారా…? వందల, వేల కోట్లు ఆస్తులున్నా… ఇంకా లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న దుర్భుద్ధితో పార్టీలు పెట్టిన వారినీ, లేదా ఉన్న పార్టీలను అధికారంలోకి తెచ్చి… పార్టీలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకూ కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ, చెరి సంగం పంచుకుంటూ… ప్రజా ధనాన్ని బొక్కేయడానికి కాదా వీరంతా అష్టకష్టాలూ పడుతున్నది?
How we vote to sick people? | telugu.newsof9.com
ఈ చిల్లర దేవుళ్లనే కదా… రోజూ పత్రికలు అపర ప్రజా ప్రతినిధులుగా కీర్తిస్తున్నది? ఎందుకోసం? ఎవరి కోసం? బెంజి కార్లలో తిరుగుతూ… లక్షల కోట్ల అవినీతి సొమ్మును వెనకేసుకుని… ఇంకా వీరికి ఏం కావాలి? అధికారమా? ప్రజల డబ్బులా…? ఎన్నాళ్లీ బూటక రాజకీయాలు? 70 ఏళ్లుగా చేసిన దాష్టీకాలు చాలవా? దిగువ వర్గాలకు రాజకీయ అధికారాన్ని ఇవ్వరా? మీ ఇనుప బూట్ల కింద నలిగిపోయి… మీరు విసిరే పించన్లు, పసుపూ కుంకుమలూ ఏరుకుంటూ.. జన్మధన్యం అని పేదవాళ్లు సంబరాలు చేసుకోవాల్సిందేనా?
ఆధునిక తరం చదువుకున్నది. వారికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ దీనిని ఆపడానికి ఏం చేయాలోనని వారంతా ఆలోచిస్తున్నారు. అలాంటి యువత, సద్భుద్ధి కలిగిన వారు, విద్యాధికులు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా… వదులుకుని ప్రజాసేవ అంటూ పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో ఒక వేకువ చుక్కలా అవతరించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ… మేం ప్రజాసేవ చేస్తామంటూ తెలుగు నాట కోటీశ్వరుల పార్టీలు దొంగ రాగాలు తీస్తున్నాయి. ప్రసంగాలు చేస్తున్నాయి. బీసీలూ…. మీకు సంవత్సరానికి 75 వేలు ఇస్తామంటూ భవిష్యత్తును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. చిల్లర పైసలు మీకు పడేస్తాం…చాలు సర్దుకోమంటున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రాజెక్టుల్నీ, తద్వారా వచ్చే కోట్లాది రూపాయల్నీ మేం తింటాం… అంటున్నాయి. అధికారం దండం కోసం అర్రులు చాస్తున్నాయి. చంద్రబాబు అయితే… దళితుల ఇళ్లలో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. తెల్లవారితే అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేస్తారు.
నిజంగా పార్టీ పెడితే… డాక్టర్ అంబేద్కర్ ఇపుడున్న నేతల్ని గుమ్మంలోకి రానిస్తాడా…? ధైర్యంగా ఆయన్ను కలిసి కనీసం సీటు ఇవ్వమని ఈ పెట్టుబడిదారులు, పార్టీల అధినేతలు అడగగలరా…?
అంబేద్కర్ వద్దు. మన దగ్గరే చూద్దాం.
వాస్తవాలు చేదుగా ఉంటాయి. ఈ మాటలు కోటీశ్వరులకు నచ్చకపోవచ్చు. చెప్పక తప్పదు.
చంద్రబాబుగానీ… జగన్మోహన్ రెడ్డికిగానీ సొంత పార్టీలు లేవని అనుకుందాం. మరి బాబు, జగన్ వస్తానంటే వీరిని జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా? వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి సీట్లు ఇస్తాడా? ‘‘నమస్కారం పెట్టి.. దయచేయండి సార్లూ’’ అంటాడు. ఎందుకంటే జనసేన సిద్ధాంతాలకు వీళ్లిద్దరూ సెట్ అయ్యే ప్రశ్న లేదు.
ఇపుడు దీనికి రివర్స్ లో ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించలేదని అనుకుందాం.
పవన్ వస్తానంటే… తెలుగుదేశం పార్టీ ఆయన్ను నెత్తిన పెట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ రెడ్ కార్పెట్ వేస్తుంది. ఇది నూరు పైసలు నిజం కాదా…?
మరి జనసేన వంటి పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకునే అర్హతే లేదని అనుకున్నపుడు.. వీళ్లు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హత సాధిస్తారు? సొంతంగా పార్టీలు పెట్టుకోగలరు… లక్షల కోట్ల ఆస్తులు ఉండటమే తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్సీపీకి ఉన్న అర్హత ఎవరైనా చెప్పగలుగుతారా?
ఈ రెండు పార్టీలూ ఏం చేస్తున్నాయి. వారు సంపాదించినంత కాకపోయినా… కోట్లున్న మారాజులకే టిక్కెట్లను కట్టబెడుతున్నాయి. అంటే… ధనవంతుల్ని ప్రజా ప్రతినిధులుగా మార్చి… పేద జనం నెత్తిన రుద్దడమే కదా. పేద ప్రజలకు సేవ చేయడానికి బెంజికార్లలో, 24 గంటలూ ఏసీల్లో ఉండే కోటీశ్వరులే కావాలా? ఆలోచించండి.
నెలకు 30 వేల రూపాయలు సంపాదించుకోవడానికి 24 గంటలూ పని చేస్తున్న యువతీ యువకులు ఎందరో ఉన్నారు. సాధారణ మధ్య తరగతికి చెందిన యువతీ యువకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే వారు ప్రజా సేవను అంకితభావంతో పని చేయరా? మీ పిల్లల్ని మీరు నమ్మరా? పేద, మధ్య తరగతికి చెందిన ప్రతి మాతృమూర్తీ తన పిల్లల్ని నీతిగానే పెంచుతుంది. కోటీశ్వరుల పిల్లలు ఏం చేస్తున్నదీ ప్రతిరోజూ పత్రికల్లో మనం చూస్తున్నాం. అమ్మా బాబూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఆయేషా మీరా అనే ముస్లిం యువతిని మానభంగం చేసి చంపేస్తే… నేటికీ నేరగాడు పట్టుబడలేదు. ఓ అమాయకుడిని ఇందుకు బలి చేశారు. ఇది కోటీశ్వరుల బిడ్డ చేసిన దాష్టీకం కాదా…? ఇలాంటి దుర్మార్గుడికి ప్రభుత్వాలు అండగా నిలిచినపుడు సభ్య సమాజం ఏం చేస్తోంది? రాజకీయ పార్టీలు ఇలాంటి అక్రమార్కులకు అండగా నిలబడకుండానే అసలు నేరగాడిని పోలీసులు తప్పించారా? డబ్బున్నవాళ్ల బిడ్డలు నేరాలు చేయడానికి కారణమే… ఈ రాజకీయ పార్టీల నుంచి అందుతున్న దన్ను. మొన్న రాకేష్ రెడ్డి అనే వాడు చిగురుపాటి జయరాంను హత్య చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీతో అతనికి ఉన్న దన్ను. లోకేష్ బాబుతో ఉన్న సాన్నిహిత్యంతోనే రాకేష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వార్తలు వచ్చాయి. తమ తల్లిదండ్రులు పెద్ద పార్టీల్లో ఉండటమో, లేక వాళ్ల తండ్రులకు ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా తప్పు చేసినా ఏమీ కాదు.. అన్న ధోరణి ఈ దురాగతాలకు కారణం అవుతోంది. ఆయేషా మీరా లాంటి బలహీనుల విషయంలో దోషులకు శిక్షలు కూడా పడటం లేదంటే చట్టాన్ని వీళ్లు ఏ విధంగా చుట్టంగా మార్చుకున్నదీ అర్థం అవుతున్నది.
మరి మన ముందున్న అవకాశాలు ఏమిటి?
మంచివాళ్లనూ, చదువుకున్న పేద, మధ్య తరగతి పిల్లలను రాజకీయ నాయకులుగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ‘‘రాజకీయాలు ఎల్లకాలం డబ్బున్న వాడి అబ్బ సొమ్ము కాదు’’ అని తెలుగు ప్రజలు నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇలా అక్రమ మార్గాల్లో ప్రజా ధానాన్ని దోచుకున్న వారు 10 శాతం మందే ఉంటారు. ఆకలి విలువ తెలిసి, పేదవాడి కోసం ఒక కన్నీటి బొట్టు కార్చే వాళ్లు 90 శాతం మంది ఉన్నారు. భయపడాల్సినదేమీ లేదు. 90 శాతం మందీ ఒక గొడుకు కిందకు వస్తే… అది ‘‘జనసేన’’ అవుతుంది. అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది.
నిమ్నవర్గాల్లో కాస్త గుర్తింపు ఉన్న నేతలు అప్పుడే పార్టీలు పెట్టుకోలేరు. అందుకే పెద్ద పార్టీలు వారికి లోపాయకారీగా వారికి కొంత సొమ్ములు అందిస్తాయి. వారు ‘‘ఫలానా వారు వస్తే మాకు న్యాయం జరుగుతుంది’’ అని నమ్మబలుకుతారు. ఎవరి అవసరాలు వారివి. అసలు సంపాదించుకోవాల్సింది బలహీన వర్గాలే. కానీ బ్రెడ్డు మొత్తం వారు తింటూ ఆ బ్రెడ్డులో చిన్న తునక బలహీన వర్గాల మొహాన విసురుతున్నారు. పేదరికంలో ఉన్నవాడికి.. ఈ చిన్న తునక పెద్దగా కనిపిస్తుంది. తప్పులేదు… తీసుకోండి. వారు చెమటోడ్చి ఆరుగాలం ఎండలో దుక్కిదున్ని సంపాదించిన డబ్బేమీ కాదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం బడుగు వర్గాల ప్రజల బతుకుల్లో నిప్పులు మాత్రం పోయకండి. ఎవరికి వేయాలో వారికే వేసేలా బడుగు వర్గాల ప్రజలు జాగ్రత్త పడాలి. అప్పుడే కొత్త ప్రపంచం వస్తుంది. కొత్త రాజకీయాలు వస్తాయి. ఆర్ధిక కష్టాలతో కిందామీదా పడుతున్న కే.ఏ.పాల్ ను కూడా ఒక ప్రధాన పార్టీ రంగంలోకి దించిందన్న అనుమానాలు ఉన్నాయి. అంతా… అధికార దండంలోనే ఉంది. నూరు పైసల నిజం. ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని కొట్టేద్దామకునే వారికే ప్రజలు అధికారన్ని అందిస్తారా?
ఎంగిలి మెతుకులు వద్దు
కోటీశ్వరులు విసిరే… వరాలు మాకొద్దు అని ప్రజలు నినదించాల్సిన తరుణం ఇదే. మా పాలన మేం చేసుకుంటాం. మా బాగు మేమే చూసుకుంటాం… మీ జాలీ దయా, దక్షిణ్యాలూ, మీరు విదిలించే ఎంగిలి మెతుకులు మాకొద్దు అంటూ యువతరం, వృద్ధతరం కూడా నినదించాల్సిన సమయం ఇదే. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. చక్కటి ఆలోచన చేయండి. అవినీతికి ఆస్కారం లేని, కోటీశ్వరుల ప్రస్తావన లేని రాజకీయాలకు నాందీ వాచకం పలకండి. ఇది విళంబి నామ సంత్సరం. అంతా సుభిక్షంగా ఉండాలని అర్థం. కాబట్టి మీ నిర్ణయాన్ని బట్టి.. అది సుభిక్షమా… క్షామమా అన్నది ఆధారపడి ఉంది.
source:FB/DalitaSena654
telugu.newsof9.com