నాయకుడు

◆ ప్రతికూల పరిస్థితుల్లో నిలబడేవాడే నిజమైన నాయకుడు.

◆ పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపునిస్తాను
నా దేశభక్తిని బీజేపీ ఎదుట నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

◆ ప్రకాశం జిల్లా జనసైనికుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Janasena

ఒంగోలు: రాజ‌కీయ పార్టీకి అభిమానులు ఎంత బ‌ల‌మో, ఒక్కోసారి అంతే బ‌ల‌హీన‌త కూడా అవుతున్నారనీ క‌ట్ట‌లు తెంచుకున్న అభిమానం పాల‌పొంగు లాంటిది కాకూడదనీ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమా హాల్లో దండ‌లు క‌ట్టిన ప్ర‌తి ఒక్క‌రూ నాయ‌కులు కాలేర‌న్నారు. ఓ క్ర‌మ‌ప‌ద్ద‌తిలో ఎద‌గాలనీ అనుభ‌వం తెచ్చుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఒంగోలు బృందావన్ గార్డెన్స్ ఫంక్ష‌న్ హాల్లో ప్ర‌కాశం జిల్లాకి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి దిశానిర్ధేశం చేశారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ‘’నేను హీరోగా ఎదిగిన త‌ర్వాత కూడా2009లో నాయ‌కుడిని అయిపోవాల‌ని ఆశ‌ప‌డ‌లేదు. ఎంపిగా, ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకోలేదు. నాకంటే అనుభ‌వం ఉన్న వ్య‌క్తి ముందుకి వెళ్తుంటే వెనక నుంచి నా వంతు తోడ్పాటు అందించాను. జ‌న‌సైనికులు చేయాల్సింది కూడా అదే. ఎన్నో ఏళ్లుగా ఈ కుళ్లు రాజ‌కీయాల్ని భ‌రిస్తూ , స‌రైన ఫ్లాట్ ఫాం లేక ముందుకి రాలేక‌పోయిన జ‌డ్జిలు, ఆఫీస‌ర్లు, వ్యాపార‌వేత్త‌లు,మేధావులు, విలువ‌లు, అనుభ‌వం ఉన్న నాయ‌కులు మ‌న కోసం వ‌చ్చారు. వారికి మ‌నం వెనుక ఉండి మ‌ద్ద‌తు ఇస్తేనే మ‌నం కోరుకుంటున్న మార్పు సాధ్య‌ప‌డుతుంది. అలా చేయ‌లేక‌పోతే మ‌న‌ బ‌లం ఒక చిన్న దార‌పుపోగే అవుతుంది. నాయ‌కులు కాద‌లుచుకున్న వారు స‌మ‌యం తీసుకోండి. అనుకూల ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు అంతా నాయ‌కులు కావ‌చ్చు, కానీ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో నిల‌బ‌డే వాడే నా దృష్టిలో నిజ‌మైన నాయ‌కుడు.

JanaSena Party

అలాగైతే జగన్ అయిదుసార్లు సీఎం అయ్యేవారు

నేటి స‌మాజంలో ముక్కు మూసుకుని బ‌త‌క‌డం కంటే , క‌ళ్లు తెరుచి స‌మ‌స్య‌లపై పోరాడుతూ బ‌త‌క‌డం క‌ష్టం. విత్తు చెట్టుగా మార‌డానికి నీటి చినుకు ప‌డితే చాల‌దు. భూమి పొర‌ల్ని చీల్చుకుంటూ ఎద‌గ‌డానికి నిత్యం పోరాటం చేస్తుంది. వ‌చ్చిన వెంట‌నే నాయ‌కులు అయిపోవాలంటే ఎలా.? నాయ‌కుడు అంటే అరుపులు కేక‌లు పెట్ట‌డం కాదు. ఓ స‌మూహాన్ని ప్ర‌భావితం చేసే వ్య‌క్తే నాయ‌కుడు అవుతాడు. తిట్టి భ‌య‌పెట్టే వారు కాదు. స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ధైర్యంగా నిల‌బ‌డి మాట్లాడ‌గ‌ల‌గాలి. అంతా నేనే అనుకునే మీరు ప‌ది వేల మందిని తీసుకురాగ‌ల‌రా.? మీరు చెబితే ప‌ది వేల మంది మీ వెనుక నిల‌బ‌డే శ‌క్తి ఉందా.? నా బ‌లం చూపి, మీ బ‌లం అంటే ఎలా.? ప‌ని చేసే ప్ర‌తి ఒక్క‌రికీ పార్టీలో గుర్తింపు ఇస్తాను. సెల్ఫ్ డిక్ల‌రేష‌న్స్ వ‌ద్దు. 2009లో ఇలా చేసే పీఆర్పీని చంపేశారు. నేను అంద‌రి ఇగోలు స‌రి చేయ‌డానికి పార్టీ పెట్ట లేదు. స‌మాజం తాలూకు అస‌మాన‌త‌లు రూపుమాప‌డానికి వ‌చ్చాను.

JanaSena Party1

ఎంత క్లిష్ట ప‌రిస్థితుల్లో పార్టీ పెట్టానంటే బ్యాంకులో రూ. 2 కోట్లు కూడా బ్యాలెన్స్ లేని స‌మ‌యంలో పార్టీ స్థాపించాను. కొంత మందికి పీఆర్పీలో ప‌ని చేసిన అనుభ‌వం ఉండి ఉండ‌వ‌చ్చు. పార్టీ అంటే మ‌న‌ల్ని ప్ర‌భావితం చేసే ఆలోచ‌న‌లు ఉండాలి. డ‌బ్బుతో రాజ‌కీయాలు చేసేయొచ్చు అనుకుంటే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌టికే ఐదారుసార్లు ముఖ్య‌మంత్రి అయ్యి వుండేవారు. లోకేష్.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో ప‌ని లేద‌ని ఎక్క‌డో ఎక్కి కూర్చునే వారు. ప్ర‌జ‌లు ఓ బ‌ల‌మైన మార్పు కోరుకుంటున్న‌ప్పుడు అది ఓ సునామీలా వ‌చ్చి ఉన్న వ్య‌వ‌స్థ‌ని తుడిచిపెట్టేస్తుంది. నాలో బ‌ల‌మైన మార్పు తీసుకురావాల‌న్న ఆకాంక్ష ఉంది.

దోచుకొనే శ్రద్ధ వెలిగొండపై లేదు

వెలిగొండ

ప్ర‌కాశం జిల్లా విష‌యానికి వ‌స్తే ఇంత మంది పెద్ద పెద్ద నాయ‌కులు ఉన్నారు. మాగుంట‌, సిద్దా కుటుంబాల‌తో నాకు ఎటువంటి విబేధాలు లేవు. గత ఎన్నిక‌ల్లో వీరు ప్ర‌జ‌ల‌కి ఏదో చేస్తార‌నే మ‌ద్ద‌తిచ్చాను. కానీ వారు జిల్లాలో ఉన్న గ్రానైట్ గ‌నుల్ని దోచుకోవ‌డంలో చూపిన శ్ర‌ద్ద వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయ‌డంలో చూప‌లేదు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ భూములు క‌బ్జా చేయ‌డంలో చూపిన ఆస‌క్తి, క‌నిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో చూప‌లేదు. నిజంగా వీరంతా ఎవ‌రి పాత్ర వారు చిత్త‌శుద్దిగా నిర్వ‌హిస్తే, నాకోసం ఇంత మంది రోడ్ల మీద‌కి ఎందుకు వ‌స్తారు.? జ‌న‌సేన‌కి ఇంత‌టి జ‌నాద‌ర‌ణ ఎందుకు ఉంటుంది? ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కులంతా మ‌న‌ల్ని ప‌ల్ల‌కీలు మోసే వారిగానే చూస్తున్నారు. ఇంకా ఎంత కాలం మోస్తాం.? మాకు ఏం చేశార‌ని మోస్తాం? ప్రాజెక్టులు పూర్తి చేశారా? ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారా.? జిల్లా నుంచి వ‌ల‌స‌లు ఆప‌గ‌లిగారా? ఏం చేశార‌ని వీరి ప‌ల్ల‌కీలు మ‌నం మోయాలి. వీరిని కిందికి దించేసి కొత్త‌త‌రం నాయ‌క‌త్వాన్ని తీసుకువ‌ద్దాం. కొత్త‌త‌రం నాయ‌క‌త్వం రావాలంటే ముందుగా మ‌న‌లోని ఆశ‌ను చంపేయాలి. నేను ఒక్క‌డినే గొప్ప‌వాడిని అనుకుంటే ఎలా.? నాకు నేనే అలా అనుకోన‌ప్పుడు, మీరెలా అనుకుంటున్నారు. నా కోసం ఎవ‌రూ త్యాగాలు చేయొద్దు. నా కోసం ఉద్యోగాలు వ‌దిలేసి వ‌చ్చాం అని చెబుతున్నారు. చేసిన త్యాగాన్ని చెప్పుకుంటే అది త్యాగం అవ్వ‌దు. రాజ‌కీయం అంటే ఎన్నో క‌ష్టాలు ఉంటాయి. ఎదురుదెబ్బ‌లు ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉండాలి. నా కోసం అయితే ఎవ‌రూ త్యాగాలు చేయొద్దు బాధ్య‌త‌తో, ప్రేమ‌తో రండి. ల‌క్ష మందికి ఓ ఆలోచ‌న వ‌స్తే, ప‌ది వేల మంది ముందుకి వ‌స్తారు. ఆచ‌ర‌ణ‌కి వ‌చ్చే స‌రికి ప‌ది మందే మిగులుతారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావానికి కార‌ణం కొన్ని కోట్ల మందిలో పుట్టిన కోపం. తెలంగాణ విష‌యానికి వ‌స్తే చ‌దువుకునే విద్యార్ధుల‌ని సైతం రెండో త‌ర‌గ‌తి ప్ర‌జ‌లుగా ట్రీట్ చేశారు. దోచుకున్నారు అనే ఓ అప‌వాదుని అంద‌రి మీదా బ‌ల‌వంతంగా రుద్దారు. దోచుకుంది పాల‌కులు. ఎమ్మెల్యేలు, ఎంపిలు దోచుకుంటే ఆ కోపాన్ని పొట్ట‌కూటి కోసం వ‌చ్చిన కూలీల మీద చూపితే ఎలా? దీని గురించి ఎవ‌రూ మాట్లాడ‌లేదు. దీని గురించి మాట్లాడిన మొద‌టి వ్య‌క్తిని నేనే. ఎవ‌రికి కోపం వ‌చ్చినా ప‌ర్వాలేదు నిజం బ‌య‌టికి రావాలి అనుకున్నా. ప్ర‌జ‌ల్ని, నాయ‌కుల నుంచి వేరు చేయ‌మ‌ని చెప్ప‌డం కోసం పార్టీ పెట్టా. స‌భ పెట్టిన‌ప్పుడు నా మీద దాడి చేయ‌డం కోసం చాలా మంది వ‌చ్చి కూర్చున్నారు. నా మాట‌లు విన్న త‌ర్వాత వారే చ‌ప్ప‌ట్లు కొట్టారు.

దర్శిలో ఏమీ లేనప్పుడు రూ. 50 కోట్లు ఎలా ఖర్చు చేశారు?

దర్శి

స‌ముద్రం మ‌ధ్య‌లో ఎంత గంభీరంగా ఉంటుందో, మార్పు తెచ్చేవాడు కూడా అంతే గంభీరంగా ప్ర‌శాంతంగా ఉంటాడు. లోప‌లికి దిగితే గాని స‌ముద్రం లోతు తెలియ‌దు. అలాగే ఓ ఆలోచ‌న‌తో ముందుకి వెళ్లే వారి మ‌న‌సు లోతు కూడా తెలియ‌దు. అందుకే ప్ర‌శాంత చిత్తంతో ఉన్న‌వారిని నేను ఇష్ట‌ప‌డ‌తాను. న‌మ్ముతాను. అరుపులు కేక‌లతో గుండీలు చించుకుంటామ‌నే వారి మాట‌లు నేను అస‌లు న‌మ్మ‌ను. వారు ఎక్కువ కాలం కూడా ఉండలేరు. ఆలోచ‌న‌తో ముందుకి వెళ్లే వారు ఎన్న‌టికీ అల‌సిపోరు. నాది ఒక్క రోజు కోపం కాదు . ద‌శాబ్దాల ఆలోచ‌న‌. స‌మాజంలో పెన‌వేసుకుపోయిన అస‌మాన‌త‌ల‌పై కోపం. ఓ మ‌హిళ మాన‌భంగానికి గురైతే, అక్క‌డ కూడా కులాల ప్ర‌స్థావ‌న ఎందుకు? దాని గురించి మాట్లాడ‌డానికి కావ‌ల్సింది మాన‌వ‌త్వం గానీ, కులం కాదు. బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ సినిమా థియెట‌ర్‌లో జ‌న‌గ‌ణ‌మ‌ణ పెట్ట‌గానే లేచి నిల్చోవాలి అంటే, దాన్ని మొట్ట‌మొద‌ట వ్య‌తిరేకించిన వ్య‌క్తిని నేను. క్రీడా మైదానాలు, ప‌బ్లిక్ పార్కులు మాయ‌మైన నేటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కి ఉన్న ఒకే ఒక వినోద సాధ‌నం సినిమా. అక్క‌డ కూడా దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది. దీని వ‌ల్ల లేచి నిలబ‌డ‌లేని వారిని అంతా తిట్ట‌డం మొద‌లు పెట్టారు. యుద్ధ స‌మ‌యాల్లో పైలెట్లు అంతా జైహింద్ చెప్పాల‌ని రూల్ పెట్టారు. అది ఒక్క యుద్ధ స‌మ‌యంలో మాత్ర‌మే కాదు రోజూ చెప్పాలి. ఇలాంటి వాటికి నేను వ్య‌తిరేకం. సుప్రీం కోర్టు కూడా నేను చెప్పిన‌దాన్ని స‌మ‌ర్ధించింది. దేశ‌భ‌క్తిని రుజువు చేసుకోవాలంటే నాకు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు రుజువు చేసుకుంటా త‌ప్ప‌, బీజేపీ నాయ‌కుల ఎదుట నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం నాకు లేదు.

క‌నిగిరిలో నా చిన్న‌త‌నంలో ఏదైతే ఫ్లోరైడ్ స‌మ‌స్య ఉందో, ఇప్ప‌టికీ అదే స‌మ‌స్య‌తో జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు లేడిపిల్ల‌లు ఇళ్ల‌లోకి వ‌చ్చేవి. కానీ అక్క‌డ నీరు తాగితే కాళ్లు వంగిపోయేవి. అది తెలిసి మా నాన్న‌గారు అక్క‌డి నుంచి తీసుకువ‌చ్చేశారు. ఇప్ప‌టికీ ఈ ప‌రిస్థితుల్లో మార్పు రాలేదు. సంఘానికి ఉప‌యోగ‌ప‌డ లేన‌ప్పుడు వేల కోట్ల ఆదాయం, ఖండాంత‌రాలు దాటిన కీర్తి ఉంటే ఉప‌యోగం ఏంటి? ఇలాంటి ప‌రిస్థితుల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు నా వంతు నేను చేయాల‌నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. అయితే పొలిటిక‌ల్ ప్రాసెస్‌లో చాలా స‌మ‌స్య‌లు ఉంటాయి. అన్నింటికీ సిద్ధ‌ప‌డే వ‌చ్చా. సైమ‌న్ క‌మిష‌న్‌కి వ్య‌తిరేకంగా బ్రిటీష్ తుపాకుల‌కి గుండెలు చూపిన టంగుటూరి ప్రకాశం గారి లాంటి నాయ‌కుల గురించి పుస్త‌కాల్లో చ‌దివి కూడా కేసులు పెడ‌తార‌ని భ‌య‌ప‌డితే ఎలా.? ఉన్న ప‌ద‌విలో నుంచి దించేస్తే వారు స‌ర్వ‌సాధార‌ణ మ‌నుషులే. సిద్ధా రాఘ‌వ‌రావు లాంటి వ్య‌క్తులు ఎన్నిక‌ల్లో గెలుపు కోసం రూ 50 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని విని ఆశ్చ‌ర్య‌పోయా. ద‌ర్శిలో ఏమీ లేదు అంటారు. ఏమీ లేన‌ప్పుడు, ఎలాంటి ఉప‌యోగం లేన‌ప్పుడు అన్ని కోట్లు ఎందుకు ఖ‌ర్చు చేస్తారు. టంగుటూరి ప్ర‌కాశం లాంటి నాయ‌కులు నిలిచిన ఈ గ‌డ్డ మీదే రూ. 50 కోట్లు ఖ‌ర్చు చేసే స్థాయి నాయ‌కులు త‌యార‌య్యారంటే, ఆ త‌ప్పు నాయ‌కుల‌ది కాదు. చూస్తూ ఊరుకున్న మ‌న‌దే. టంగుటూరి ప్ర‌కాశం పంతులు గారిలా ఉన్న డ‌బ్బు స‌మాజానికి ఖ‌ర్చు పెట్టి త‌క్కువ డ‌బ్బుతో ఎన్నిక‌లకి వెళ్లే వ్య‌క్తులు కావాలి. డ‌బ్బు ఉన్న వారు జ‌న‌సేన‌లోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్నాం. అయితే మీ డ‌బ్బు దోపిడిని నిలువ‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డాలి. మాగుంట లాంటి వ్య‌క్తులు స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌డానికి కృషి చేయాలి. కానీ నేటి నాయ‌కులు డ‌బ్బు ముఖాన ప‌డేస్తే జ‌నం మ‌న వెనుకే ఉంటారులే అని మాట్లాడుతున్నారు. ఆ త‌ప్పు ఎవ‌రిది.

యూనివర్సిటీ బాధ్యత నాది

యూనివర్సిటీ

ప్ర‌కాశం జిల్లాకి యూనివ‌ర్శిటీ తీసుకువ‌చ్చే బాధ్య‌త నాది. వెలిగొండ ప్రాజెక్టు విష‌యానికి వ‌స్తే.. టీడీపీ-వైసీపీ నాయ‌కులు సైతం ఆ స‌మ‌స్య గురించి మాట్లాడాల‌ని నన్ను అడుగుతున్నారు. వారి నాయ‌కులు చేయ‌లేని ప‌ని మ‌నం చేసి చూపుదాం. జ‌న‌సేన‌తో న‌డ‌వాల‌నుకున్న వారు సుధీర్ఘ ప్ర‌యాణం పెట్టుకోండి. 2019లో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని మాత్రం అనుకోవ‌ద్దు. ఒక్కో స‌మ‌యంలో భ‌గ‌వంతుడు ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో ఫ‌లితం ఇవ్వొచ్చు. ప్ర‌త్య‌ర్ధులు మ‌న‌కి బ‌లం లేదు లేదు అంటుంటే, నాకు ఉంది ఉంది అనిపిస్తుంది. కేసీఆర్ గారు గ‌తంలో మ‌న బ‌లం ఒక్క శాత‌మేన‌ని చెప్పారు. ఇప్పుడు 12 శాతం అంటున్నారు. త‌క్కువ రోజుల్లో మ‌న బ‌లం బాగా పెరిగింది. అలా అని లెక్క‌లు వేసుకుంటూ ముందుకి వెళ్ల‌డం నాకు ఇష్టం లేదు. స్వ‌తంత్రం వ‌చ్చిన త‌ర్వాత కొన్నేళ్ల‌కి ఎమ‌ర్జెన్సీ వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో కొత్తత‌రం ఆలోచ‌న‌తో ముందుకి వ‌చ్చింది. 80వ ద‌శ‌కంలో తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కొత్త‌ర‌క్తాన్ని ఎక్కించింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా అన్ని పార్టీల‌తో పాటు పాతుకుపోయింది. ఆ త‌ర్వాత కొత్త‌త‌రం రాలేదు. 2009లో ప్ర‌య‌త్నం జ‌రిగినా., ఓట‌మి త‌ర్వాత ముందుకి వెళ్ల‌లేక‌పోయాం. 2014లో రాజ‌కీయాల్లోకి రావ‌డానికి నిర్ణ‌యించుకున్న‌ప్పుడు నాలో ఉన్న ఆలోచ‌న ఒక‌టే. స‌త్యాన్ని నిల‌బెట్టేవాడు, ధ‌ర్మాన్ని కాపాడేవాడు బ‌య‌టికి రాకుంటే ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతాయ‌న్న ఆలోచ‌నే న‌న్ను రాజ‌కీయాల వైపు న‌డిపించింది. ఈ త‌రాన్ని మేల్కొల‌ప‌క‌పోతే 20 ఏళ్ల త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయోన‌న్న భ‌యం న‌న్ను ముందుకి న‌డిపించింది. స‌త్యాన్ని ఆవిష్క‌రింప చేసేందుకు అంద‌రితో గొడ‌వ‌లు పెట్టుకోవ‌డానికి సైతం నేను సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *