రాజకీయాలకు శ్రమ, ఓపిక చాలా అవసరమని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సామాజిక మార్పు తీసుకురావడం తన ఆశయమని, దానికోసమే సినిమాలను సాధనంగా ఉపయోగించుకున్నానని తెలిపారు.
బుధవారం భీమవరం సమీపంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్ లో ‘నవయుగ జనసేన’ పేరుతో సేవాకార్యక్రమాలు చేస్తున్న జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు జనం మధ్య తగాదాలు పెట్టి విభజించి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటివారిని నిలువరించి ధైర్యంగా ఎదుర్కొవడానికే జనసేన పార్టీని ప్రారంభించాను అన్నారు. జనసేన మూడో ప్రత్యామ్నాయమని, మూడో ఆలోచన విధానం రావడం వల్లే ఉద్దానం, ఉండవల్లి వంటి సమస్యలు బయటకు వచ్చాయని గుర్తు చేశారు.
ఉద్ధానం కిడ్నీ సమస్యను బయటకు తీసుకొచ్చింది ఎవరో పెద్ద రాజకీయనాయకుడు కాదని, మీలాగే ఒక జన సైనికుడని అన్నారు. ప్రతి మండలానికి 15 నుంచి 20 మంది యువతతో కమిటీ వేస్తామని, ప్రజా సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి గ్రామ గ్రామానికి తిరిగి ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వ్యధలు స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. మీరు తెచ్చిన సమాచారంతోనే భావితరాల భవిష్యత్తు బాగుండడం కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో నిర్ణయిద్దామన్నారు. రాజకీయాలకు వేల కోట్లు అవసరం లేదని, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడితే ప్రజలు మన వెనక ఉంటారని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. వేల కోట్లు డబ్బులు ఉంటే అహకారం, తలపొగరు పెరుగుతాయని అన్నారు.
సహనానికి కూడా హద్దు ఉంటుందని, బెదిరించి, గుండాయిజానికి దిగితే భయపడొద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఉదయం నుంచి ఫంక్షన్ హాల్ కు భారీగా అభిమానులు తరలివచ్చారు. వారికి ఫంక్షన్ హాల్ పై నుంచి శ్రీ పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.