జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, ప్రజా సంబంధిత కార్యక్రమాల నిర్వహణపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు విజయవాడలో మంగళవారం ఉదయం నుంచి పార్టీ ముఖ్య నాయకులతో, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు బాసటగా నిలుద్దామన్నారు.
ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల పక్షాన నిలిచే పార్టీ జనసేన అనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉందామని తెలిపారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా చర్చించారు.
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం పార్టీ శ్రేణులనీ, వివిధ వర్గాల ప్రతినిధులను, ప్రజలను శ్రీ పవన్ కల్యాణ్ గారు కలిశారు. గుంటూరు ప్రాంతానికి ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన కొందరు మాట్లాడుతూ తమకు సొంత గ్రామాల్లో వ్యవసాయం ఉన్నా కలిసి రాకపోవడం వల్లే కూలీ పనులకు వచ్చామని చెప్పి… వయసు మీదపడ్డా పెన్షన్లు ఇవ్వలేదని వాపోయారు. రైతులు తమ ఇబ్బందులను వివరించారు.
విద్యార్థులు, యువతీయువకులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు ముచ్చటించారు.
పార్టీ కార్యాలయంలో పెంచుతున్న గోవులకు నమస్కరించి వాటి ఆలనాపాలన గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణపనులను పరిశీలించారు.