• రేపు ప్రకటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
కొత్త తరం రాజకీయ వ్యవస్థ రూపకల్పన, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందించడం, సమసమాజ నిర్మాణం, యువతరానికి పాతికేళ్ళ భవిష్యత్తును అందించడానికి ఆవిర్భవించిన జనసేన పార్టీ ఆ దిశగా మరింత బలంగా రాజకీయాలు నెరపడానికి ప్రస్తుతం ముఖ్యమైన కమిటీలకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేశారు. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై విస్తృతంగా సీనియర్ నాయకులతో చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు రూపమిచ్చారు. వర్తమాన రాజకీయాలు, ప్రజా సంక్షేమం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్టీ భవిష్యత్ వ్యూహాలను రచిస్తున్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తుని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాజకీయాలను నెరపుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రణాళికలను తయారుచేస్తున్నారు. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి పరిపుష్టం చేయాలనే కృత నిశ్చయంతో కార్యాచరణ సిద్ధమవుతోంది. వాడవాడలా జనసేన జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు.
కొత్త కమిటీలను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు. రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పోలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉన్నాయి.