హైపర్ ఆది
ఇప్పటివరకు జబర్ధస్త్ కార్యక్రమంలో అందరిని కడుపుబ్బా నవ్వించిన హైపర్ ఆది సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పంచ్ డైలాగులతో అత్యద్భుతమైన టైమింగ్ కామెడీతో కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఆది ఇక జబర్ధస్త్ కార్యక్రమంలో కనిపించడు. బుల్లితెరకు గుడ్ బై చెప్పి రాజకీయ రణరంగంలోకి దూకబోతున్నాడు ఆది.
హైపర్ ఆది.. రైజింగ్ రాజు అనే ట్యాగ్ ఇక జబర్ధస్త్ లో మనకి కనబడదు. ఇన్నాళ్లు మనల్ని నవ్వుల ప్రపంచంలో ముంచి తేల్చిన ఈ కాంబినేషన్ విడిపోనుంది. దానికి కారణం.. హైపర్ ఆది జనసేన పార్టీలో జాయిన్ అయ్యి.. రాజకీయ నాయకుడిగా అవతారమెత్తబోతున్నాడు. ఇన్నాళ్లు తన కామెడీ ప్రాసతో ఉర్రూతలూగించిన ఆది.. హాట్ హాట్ పోలిటికల్ పంచ్ లతో చెలరేగిపోనున్నాడు. అయితే ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే ఆది.. జనసేన తరుపున.. పవన్ కు మద్దతుగా తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకునేవాడు. గతంలో కత్తి మహేష్ వివాదంలో కూడా తలదూర్చిన ఆది కత్తి మహేష్ మాటలకు ధీటుగా సమాధానాలు చెప్పడమే కాకుండా తనదైన శైలీలో ఆడుకున్నాడు కూడా. అప్పటినుండి పవన్ భక్తుడిగా ముద్రపడిన ఆది తరువాత కాలంలోనూ జనసేన కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ అడుగులకు మద్దతు తెలుపుతూనే వస్తున్నాడు. తాజాగా జరిగిన జనసేన కవాతు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గోన్నాడు కూడా. ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు కార్యక్రమంలో జనసైనికులతో పాటు అడుగులు వేసిన ఆది.. పవన్ బహిరంగ సభపైన కనిపించారు.
హైపర్ ఆది.. రైజింగ్ రాజు
జబర్ధస్త్ లో అందరికంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉండటమే కాకుండా అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఆది సడన్ గా జబర్ధస్త్ ను విడిచి వెళ్లిపోవడంతో కామెడీ అభిమానలకు తీరని లోటనే చెప్పాలి. నిజానికి ఎంతమంది కమెడియన్స్ జబర్ధస్త్ లో ఉన్నా.. ఆది పంచ్ డైలాగుల కోసం పడిపడి వెయిట్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. అతనికి సంబంధించిన కామెడీ స్కిట్ వీడియోలు సైతం మిలియన్ల వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తుంటాయి. మొదట్లో బుల్లితెరకు పరిచయం కావడానికి ఎన్నో స్ట్రగుల్స్ చూసిన ఆది.. కెరీయర్ హైపిచ్ లో ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆయన అభిమానులను కొంత కలవరానికి గురి చేస్తుంది. అయితే ఆదికి.. మల్లెమాల ప్రోడక్షన్స్ కి మధ్య పేమంట్ విషయంలో తేడాలు రావడంతో జబర్ధస్త్ వదిలేస్తున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అవన్నీ నిజం కాదని కేవలం రాజకీయాల్లోకి వెళ్లడం కోసం పవన్ కళ్యాణ్ కి అండగా నిలవడం కోసం మాత్రమే జబర్ధస్త్ ను వదిలి వెళుతున్నట్లు ఆది సన్నిహితులు చెబతున్నారు.గతంలో ఆదికంటే ముందునుంచి జబర్ధస్త్ కే చెందిన షకలక శంకర్ కూడా పవన్ కళ్యాణ్ భక్తుడిగా వీరవిధేయుడుగా ముద్రపడ్డాడు. శంకర్ కూడా తన స్కిట్ల ద్వారా ఈ విషయాన్ని చాలా సార్లు చాటుకున్నాడు కూడా. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా శంకర్ కూడా ఎన్నో సార్లు మీడియా ముందు కూడా మాట్లాడాడు. అయితే అతను సినిమాల్లోకి వెళ్లి జబర్ధస్త్ కు దూరమయ్యాడు. కానీ ఆది మాత్రం డైరక్టుగా పవన్ కోసం పీక్ లో ఉన్న తన కెరీయర్ ను త్యాగం చేస్తున్నాడని
జనసేనలో ఆది ప్రస్థానం.. ఆయన స్థానం..
జనసేన పార్టీకి అత్యంత వీరవిధేయుడిగా ఇప్పటికే జనసైనికుల్లో పేరు పొందిన హైపర్ ఆది.. ఆ పార్టీలో కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఆయన పుట్టిన నెల్లురు జిల్లా నుంచి గానీ.. లేదా అతడు పెరిగిన ఒంగోలు నుంచి గానీ జనసేన తరుపున ఎమ్మెల్యేగా పోటి చేయబోతున్నాడని సమాచారం. ఇందుకు గానూ జబర్ధస్త్ జడ్జ్, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొదటినుంచి ఆదికి ఫుల్ సపోర్టర్ గా నిలచిన నాగబాబు అతని రాజకీయ ప్రస్థానానికి మెరుగులు దిద్దనున్నారు. కేవలం నాగబాబు మాత్రమే కాదు మెగా కుటుంబం నుంచి ఆదికి ఫుల్ సపోర్ట్ ఉందని మెగా అభిమానులు అంతా చెప్పే మాటే. ఇప్పటికే రంగంలోకి దిగిపోయిన ఆదికి వెన్నుదన్నుగా మెగా బ్రదర్ నాగబాబు అండ్ కో.. కొండంత అండగా ఉండటంతో రాజకీయాల్లో కూడా ఆది హైపర్ చూపిస్తాడనడంలో ఎటువంటి సందేహాం లేదు.
పవన్ సమక్షంలో త్వరలో…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో హైపర్ ఆది త్వరలో అధికారికంగా జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం తూర్పుగోదావరిజిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తో ఆది భేటి కూడా జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఆది అంటే అభిమానం చూపిస్తున్న జనసైనికులు ఆయన రాకకోసం వేచి చూస్తున్నారు.
మరీ ఇన్నాళ్లు అందరివాడుగా ఉన్న ఆది త్వరలో కొందరివాడిగానే మారిపోబోతున్నాడా..? లేక అందరి ఆశిస్సులతో అందలం ఎక్కనున్నాడా..? ఏమో వేచి చూడాలి..!