వరద నష్టంపై జనసేనాని #పవన్‌కళ్యాణ్ గారికి నివేదిక అందచేసిన వేమూరు జనసేన నాయకులు శ్రీ భరత్_భూషణ్ గారు–>వరద ముంపుకు గురైన లంక గ్రామాలను ఆదుకోవాలి..వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు నష్టపరిహారం చెల్లించాలని శ్రీ అప్పికట్ల భరత్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోనే 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయన్నారు…
వరదల ముంపు బారినపడ్డ గ్రామాల్లో గత కొన్ని రోజులుగా అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించడం జరిగింది. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణ మాఫీ చేయాలి. రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో చేసిన క్రాఫ్ ఇన్సురెన్స్ క్లెయిమ్ పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలి. పసుపు, కంద లాంటి పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. తదుపరి పంట కోసం వారికి విత్తనాలు కూడా లభించని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలి…
వ్యవసాయ సంబంధ రంగాల మీద ఆధారపడి ఉన్న కూలీలకు 6 నెలల వరకు పనులు ఉండని పరిస్థితి నెలకొంది. ఆ కాలంలో వారికి ప్రభుత్వం తక్షణం నిత్యావసర వస్తువులు సరఫరా చేసే బాధ్యతను తీసుకోవాలి. పనులకు వెళ్లే డ్వాక్రా మహిళలకు 6 నెలల పాటు రుణాలపై వడ్డీ మాఫి చేయాలి. వరద ముంపు ప్రాంతాల్లో 6 నెలల పాటు ఎలక్ట్రిసిటీ బిల్లులు మాఫీ చేయాలి. వలలు కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వమే కొత్త వలలు అందించాలి. కొన్ని ప్రాంతాల్లో వేటకు వెళ్లే పడవలు సముద్రం పాలయ్యాయి. వాటిని సమకూర్చాలి…
వేమూరు నియోజకవర్గంలోని ఓలేరు, పల్లెపాలెం గ్రామాల పరిధిలో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం నియమించిన గజ ఈతగాడు వెంకటరాజు విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందాడు. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు, ఆసరా కోల్పోయిన తల్లికి ఉద్యోగం ఇవ్వాలి. అతని కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందచేయాలి. వరద ముంపునకు గురైన హరిజనవాడలు, దళితకాలనీలు ఇప్పటికీ వరద నీటిలో ఉండటంతో తీవ్ర దుర్గంధం వస్తోంది. అక్కడ తగిన సహాయక చర్యలు చేపట్టాలి. తక్షణం మోటర్ల సహాయంతో నీటిని తొలగించి, బ్లీచింగ్ వేయాలి. ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు