చిరంజీవికి ముందు తెలుగుహీరో వేరు, చిరంజీవొచ్చాకా పరిస్థితి వేరు..
రోడ్డుకడ్డంగా స్టాండేసున్న బైక్ మీద స్టైల్గా సిగరెట్ కాలుస్తూ మెల్లగా తలెత్తి కన్నుకొట్టి తెలుగుతెరకి అంతకుముందెరుగని బిల్డప్పుల్ని రుచి చూపించాడు..
డ్యాన్సులంటే ఎక్సెర్సైజులు, డ్రిల్లులతో సరిపెట్టించిన డ్యాన్స్ మాస్టర్ల స్టెప్పులకి కొత్త గ్రేసునద్దాడు..
ఫైటింగులంటే లాంగ్ షాట్లో డూపుల్ని పెట్టి గాల్లో పిల్లిమొగ్గలేయించిన హీరో నేల మీదకొచ్చి రైల్ బోగీ కింద వేలాడాడు.. ఆ ఫైట్లకి వేగాన్ని నేర్పాడు..
తెరమీద చేసే ప్రతీ విన్యాసంతోనూ తెరముందున్న నేలటికెట్టు మాస్ గాడితో ఈలలేయించాడు..
బెంచిలో కూర్చున్నవాళ్ళ కళ్లు పెద్దవి చేయించి నోళ్లు తెరిపించాడు..
బాల్కనీలో ఉన్న క్లాసు ప్రేక్షకుల్ని సైలెంటుగా గోళ్లు కొరికించాడు..
క్లాసు, మాసు, ఫ్యామిలీ.. యే వర్గ భేదాల్లేకుండా ఆంధ్రా, నైజాం, సీడెడ్ అన్ని ఏరియాల్ని రఫ్ఫాడించొదిలాడు..
చిరంజీవి పాడిందే పాట.. “బంగారు కోడిపెట్టా.. వచ్చెనండీ.. హే పాపా హే పాపా…” మన చిన్నప్పుడు ప్రతీ గుడి ఉత్సవాల్లో వినిబడ్డ కంపల్సరీ కీర్తన..
చిరంజీవి చెప్పిందే డైలాగ్.. ‘మాస్టారూ.. కొంచెం ఫేస్ ఇలా టర్నింగిచ్చుకుంటారా..?’ ‘చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో..’ ‘అంతొద్దు – ఇది చాలు’..
ఈ డైలాగులు కొట్టని పిల్లకాయలు, చొక్కా కాలర్ వెనక్కేయని కుర్రాళ్లు లేరు.. (ఈ ఎలిమెంట్స్ వల్లే కుర్రాళ్లలో టెంపరితనం కూడా మొదలైందన్న విమర్శలు కూడా లేకపోలేదు..)
ఎవరేమన్నా అభిమానుల దృష్టిలో అతిలోకసుందరి అందానికి తూగే డైనమిజం ఉన్న జగదేకవీరుడు, సినీపేటకి మేస్త్రి.. అన్నీ అంజనీపుత్రుడే..
ఏడు ఇండస్ట్రీ హిట్లతో ఏకఛత్రాధిపత్యంగా వెలిగి సినిమాల్నొదిలి రాజకీయాల్లోకెళ్ళేదాక మెగాస్టారే లాస్ట్ నెంబర్ వన్..
ఒక ఊరి కరణం ఇంకో ఊరికి జుట్టుపోలిగాడన్నట్టు సినీశిఖరాల్ని వివాదాల్లేకుండా ఎక్కిన మెగాస్టార్ రాజకీయాల్లోకొచ్చి వాయిదాల్లో కిందకి జారాడు..
రాజకీయాలకి సరిపడని మనిషి.. చెయ్యడం రాలేదు, చేసిన విధానం అంతకంటే బాగోలేదు.. రాష్ట్రవిభజనప్పుడు వేసిన స్టెప్పులు యే అభిమానికీ నచ్చలేదు..
బలమున్నచోట నవ్వాలి తప్ప నవ్వులపాలయ్యే చోట నిలబడకూడదనే నగ్నసత్యాన్ని పదేళ్ల స్వల్పకాలంలోనే గ్రహించి కాంగ్రెసులో కలిసొచ్చిన పదవీకాలం ముగియగానే తిరిగి పునరావాసానికి మరలాడు..
జనాలు మళ్లీ చూస్తారా.. ?? అందరిలోనూ సందేహం..
కానీ Once a King, Always a King కదా..
వస్తూ వస్తూనే ఒక రీమేక్ యావరేజ్ సినిమాతో బాహుబలికి తప్ప అప్పటికి మరే బలుడికి సాధ్యంకాని 104 కోట్ల షేర్ ని అవలీలగా సాధించి బాక్సాఫీసు దగ్గర బాసుకి టైం గ్యాపొచ్చింది తప్ప టైమింగ్ గ్యాప్ కాదని నిరూపించాడు.. 👌
ఇది చాలదా హీరోగా చిరంజీవికున్న యాక్సెప్టెన్సీ లెవెల్స్ తెలియజేయడానికి..
కులాలు, వాటి బలాలు.. పార్టీలు, అవి పెట్టే గొడవలు.. ఇవేమీ తెలీని చిన్నప్పటి రోజుల్లో ప్రతీ సగటు కుర్రాడి మనసు ఇష్టపడ్డ అసలు సిసలు సినీహీరో చిరంజీవి..
By
Haribabu Maddukuri