ప్రాంతాలు, జాతులు, మతాలు, కులాల కలయికే భారతదేశమని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య తగాదాలు, జాతుల మధ్య వైరాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని పాండురంగపురం వైట్ హౌస్ లో విశాఖలో స్థిరపడ్డ, నివసిస్తున్న ఉత్తర భారతీయుల సమావేశంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడారు. వైజాగ్ ఫ్లై వుడ్ అసోసియేషన్, రాజస్థాన్ సంస్కృతి మండల్, రాజస్థానీ మహిళా సమితి, అగర్వాల్ మహాసభ సమాజ్, తెరాబంధు సభ, విప్ర సభ, మార్వాడి యువ మంచ్… తదితర అసోసియేషన్ల సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
మనది వసుధైక కుటుంబమని, మన సంస్కృతిని మార్చేందుకు చాలా మంది యూరోపియన్లు ప్రయత్నించారని, కానీ వాళ్లే మారిపోయారని చెప్పారు. భారతమాతకు గుడి కట్టిన ఏకైక ప్రాంతం ఉత్తరాంధ్ర అని గుర్తు చేసిన ఆయన. సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం ఉండాలని పార్టీ సిద్ధాంతాల్లో పెట్టానని తెలిపారు. ఏపీలో ఏకైక కాస్మోపాలిటిన్ సిటీ వైజాగ్ మాత్రమేనని, దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని స్పష్టం చేశారు.
భారతీయతను అర్ధం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెబుతూ మనందరం కలిసి ప్రాంతీయ విభేధాలు తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. 10ఏళ్లు అధికారంలో లేరు ప్రజలకు అండగా ఉంటారని 2014లో టీడీపీకి మద్దతు ఇస్తే విశాఖలో భూకబ్జాలు, కాలుష్యాన్నిపెంచి పోషిస్తున్నారని, రాజకీయాలంటే వేల కోట్లు సంపాదన, గుండాలు, రిగ్గింగ్ లు అన్న స్థాయికి దిగజార్చారని దుయ్యబట్టారు.
10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చాలా ప్రభావం చూపిందని, అన్నీ వదులుకుని శాంతి మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అప్పుడు చిరంజీవిగారు చెప్పిన మాటలు మళ్లీ నాలో ఆలోచనలు రేకెత్తించాయని, ఏదైనా సాధించి, సంపాదించాక దానిని వదులుకోవడానికి సిద్ధమైనప్పుడు ఆ మాట చెప్పు అని అన్నారని, అందుకే సినిమాల్లో సంపాధించి, రాజకీయ పార్టీ పెట్టి మళ్లీ ప్రజలకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. నేను నటుడిని అవ్వాలని అనుకోలేదని, కానీ నటుడ్ని అయ్యానని, చాలా తక్కువ సినిమాలే చేసినా భగవంతుడి కృప వల్ల 100 సినిమాలు చేసిన ఇమేజ్ వచ్చిందని, ఏమీలేని స్థాయి నుంచి రూ.25 కోట్లు పన్నులు కట్టే స్థాయిని వచ్చానని చెప్పారు.
నాకు డబ్బు అవసరం లేదని, సమతుల్యత, శాంతి కావాలని అన్నారు. అందుకే అజ్ఞాతవాసి ఫెయిల్ అయితే తిరిగి డబ్బులు ఇచ్చేశానని గుర్తు చేశారు. డాన్సు చేయమంటే చేయలేను కానీ, ప్రజా సమస్యలపై పోరాటం చేయమంటే చేస్తానని అన్నారు. రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకురావడమే జనసేన ధ్యేయమని, డబ్బుకోసం, పార్టీ ఫండ్ పేరుతో పీడించే పార్టీ కాదని అన్నారు. మీరు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకైనా సపోర్టు చేయండి కానీ ప్రజా సమస్యలపై పోరాటంలో మాత్రం జనసేనకు మద్దతు ఇవ్వమని కోరారు.